హరిత హోటళ్ల నిర్వహణకు టెండర్లు..ఒకే నోటిఫికేషన్​ జారీ చేసిన పర్యాటక శాఖ

హరిత హోటళ్ల నిర్వహణకు టెండర్లు..ఒకే నోటిఫికేషన్​ జారీ చేసిన పర్యాటక శాఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 21 హరిత హోటళ్లు, రెస్టారెంట్లను ప్రైవేటు​వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ హోటళ్ల నిర్వహణ కోసం ఆసక్తి గలవారు ఏప్రిల్ 16 లోగా ప్రపోజల్‌‌  రిక్వెస్ట్  పంపాలని అధికారులు సూచించారు.

రెస్టారెంట్ల వారీగా లీజులను సైతం ఖరారు చేసి నోటిఫికేషన్లలో స్పష్టం చేశారు. గతంలో ఒక్కో హోటల్ కు వేర్వేరుగా టెండర్లు ఆహ్వానిస్తే ఆశించిన స్పందన రాకపోవడంతో తాజాగా అన్నింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్  ఇచ్చామని అధికారులు చెప్పారు.  

మహతి ఆడిటోరియానికి 9 లక్షలు

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  సొంత నియోజకవర్గం గజ్వేల్ లో మహతి ఆడిటోరియాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీన్ని సైతం లీజుకు ఇచ్చేందుకు పర్యాటక శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఏడాదికి ఈ ఆడిటోరియానికి రూ.9 లక్షల రేటు ప్రకటించింది. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాద్రిలో 17 షాపులను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైన పర్యాటక శాఖ ఆ షాపులకు ఏటా రూ.20,40,000 ధర నిర్ణయించింది.